తెలంగాణలోని అభయారణ్యాల్లో వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను జోడిస్తోంది. ముఖ్యంగా పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్ల సంచారాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు అటవీశాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్మార్ట్ కెమెరాలను రంగంలోకి దించుతోంది. ప్రయోగాత్మకంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో ఈ ఏఐ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఈ డిజిటల్ పెట్రోలింగ్ వ్యవస్థ ద్వారా అటవీ ప్రాంతంలో నిరంతర గస్తీ సాధ్యం కానుంది.
ఈ ఏఐ స్మార్ట్ కెమెరాలు కేవలం వన్యప్రాణుల కదలికలను మాత్రమే కాకుండా, అడవిలోకి ప్రవేశించే వేటగాళ్లను (Poachers) కూడా తక్షణమే గుర్తిస్తాయి. అసాధారణ కదలికలు కనిపించిన వెంటనే అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేస్తాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్, అస్సాంలోని కజిరంగా వంటి ప్రముఖ నేషనల్ పార్కుల్లో ఈ సాంకేతికత అందుబాటులో ఉంది. ఇప్పుడు తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వుల్లో కూడా వీటిని ఏర్పాటు చేయడం ద్వారా వన్యప్రాణుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2047 నాటికి తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న సాధారణ కెమెరాల స్థానంలో ఈ స్మార్ట్ కెమెరాలను అమర్చడం ద్వారా అటవీ సంపదను కాపాడటంతో పాటు, కార్చిచ్చు (Forest Fires) వంటి ప్రమాదాలను కూడా ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. టెక్నాలజీ సాయంతో అటవీ గస్తీని మరింత పకడ్బందీగా నిర్వహించి, రాష్ట్రాన్ని వన్యప్రాణుల సురక్షిత నిలయంగా మార్చడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.








