హైదరాబాద్ ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒక కేసు విషయంలో నిందితుడికి ఊరట కలిగించేందుకు లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఎస్సైలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తున్న ఎస్ఐ బాబు నాయక్, ఎస్ఐ ప్రమోద్ ఒక నిందితుడికి 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చేందుకు, కేసులో ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేశారు.
బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పక్కా పథకం రచించారు. సోమవారం బాధితుడి నుంచి ఎస్సైలు లక్ష రూపాయల నగదు తీసుకుంటుండగా, మాటు వేసిన ఏసీబీ బృందం వారిని పట్టుకుంది. లంచం తీసుకున్న సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, ఇద్దరు ఎస్సైలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహించి కీలక పత్రాలను పరిశీలించాయి.
సైబర్ నేరాలను అరికట్టాల్సిన అధికారులే ఇలా అవినీతికి పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది. పట్టుబడిన ఇద్దరు ఎస్సైలపై ఏసీబీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్‌కు తరలించనున్నారు. అవినీతికి పాల్పడే అధికారుల సమాచారాన్ని వెంటనే తమకు తెలియజేయాలని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచించారు.








