AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు: రూ. 40 వేలు లంచం తీసుకుంటూ హోంగార్డు, డాక్టర్ అరెస్ట్

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు శనివారం భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఒక మృతదేహానికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చేందుకు బాధితుడి నుంచి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసిన గాంధీ ఆసుపత్రి డాక్టర్ సందీప్‌, కీసర హోంగార్డు నాగేష్‌లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులు ఇద్దరూ కలిసి బాధితుడి వద్ద రూ. 2 లక్షలు డిమాండ్ చేయగా, చివరకు లక్ష రూపాయలకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచితంగా అందాల్సిన పోస్టుమార్టం నివేదిక కోసం ఇలా డబ్బులు అడగడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. పథకం ప్రకారం, శనివారం కీసర ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వద్ద బాధితుడి నుంచి మొదటి విడతగా రూ. 40 వేలు నగదు తీసుకుంటుండగా అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆసుపత్రి వైద్యుడితో కలిసి హోంగార్డు ఈ అవినీతికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

ప్రస్తుతం ఏసీబీ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదా గతంలో కూడా ఇలాగే ఎవరి దగ్గరైనా డబ్బులు వసూలు చేశారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.

ANN TOP 10