టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. ఏళ్ల తరబడి సాగిన సస్పెన్స్‌కు తెరదించుతూ ఈ స్టార్ జంట గురువారం ఒక్కటయ్యారు. వివాహం అనంతరం విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తన ప్రాణ స్నేహితురాలైన రష్మికను భార్యగా పొందడం తన అదృష్టమని, ఆమెతో ఉన్న బంధం గురించి ఆయన రాసిన మాటలు అభిమానుల హృదయాలను హత్తుకుంటున్నాయి.
విజయ్ తన పోస్ట్‌లో రష్మికపై ఉన్న ప్రేమను అక్షరబద్ధం చేస్తూ.. “తనతో ఉంటేనే నా రోజు పూర్తి అవుతుంది. తను పక్కన ఉంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను. ఇల్లు అంటే ఒక కట్టడం కాదు, తను ఎక్కడ ఉంటే నాకు అదే ఇల్లు అనిపించింది” అంటూ ఎమోషనల్ అయ్యారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాలతో వెండితెరపై అలరించిన ఈ జోడీ, నిజ జీవితంలో కూడా భాగస్వాములు కావడం విశేషం. అభిమానులు ఎంతో కాలంగా వీరిద్దరినీ కలిపి పిలుచుకుంటున్న ‘విరోష్’ (ViRosh) పేరునే తమ పెళ్లికి అధికారికంగా ఖరారు చేయడం విశేషం.
ఉదయ్‌పూర్‌లోని ‘మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్’లో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత ఇరు కుటుంబాల వారు మీడియాకు మిఠాయిలు పంచి తమ సంతోషాన్ని పంచుకున్నారు. సంప్రదాయబద్ధంగా సాగిన ఈ వేడుకలో విజయ్, రష్మికల జంట చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తన బెస్ట్ ఫ్రెండ్‌ను భార్యగా చేసుకున్నానని విజయ్ పెట్టిన పోస్ట్‌కు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.








