AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయింది జగన్ అసమర్థత వల్లే: ఏపీ శాసనమండలిలో మంత్రుల ధ్వజం

రాయలసీమ ఎత్తిపోతల పథకం (రాయలసీమ లిఫ్ట్) పై ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయి వాగ్వాదం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలోనే ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని, ఇప్పుడు తమను ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 2020లోనే జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) ఆదేశాలతో పనులు ఆగిపోయినప్పుడు, నాటి జగన్ ప్రభుత్వం కనీసం కౌంటర్ దాఖలు చేయకుండా నిర్లక్ష్యం వహించిందని, ఆ అసమర్థత వల్లే సీమకు అన్యాయం జరిగిందని పయ్యావుల కేశవ్ నిలదీశారు. గత ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులను జగన్ నిర్వీర్యం చేశారని వారు విమర్శించారు.

తమ కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉందని, గత 20 నెలల్లోనే సీమ ప్రాజెక్టుల కోసం రూ. 8,000 కోట్లు ఖర్చు చేశామని మంత్రులు వెల్లడించారు. తాజా బడ్జెట్‌లో మరో రూ. 10,014 కోట్లు కేటాయించి రాయలసీమను ‘రతనాల సీమ’గా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హంద్రీనీవా పనులు పూర్తి చేసి కేవలం 190 రోజుల్లోనే 44 టీఎంసీల నీటిని తరలించామని, ప్రస్తుతం రాయలసీమ ప్రాజెక్టుల్లో రికార్డు స్థాయిలో 366 టీఎంసీల నీటిని నిల్వ చేశామని మంత్రులు వివరించారు. వైసీపీ హయాంలో జీఓ 365 తెచ్చి 102 సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేయడమే కాకుండా, గోరుకల్లు, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులను గాలికొదిలేశారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీమ ప్రాజెక్టుల పూర్తి కోసం ఒక యజ్ఞంలా పనిచేస్తుంటే, వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో రూ. 12 లక్షల కోట్ల బడ్జెట్‌లో సీమకు 1 శాతం నిధులు కూడా ఖర్చు చేయని జగన్, ఇప్పుడు ప్రాజెక్టుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డిని ‘రాయలసీమ ద్రోహి’గా అభివర్ణిస్తూ, వైసీపీ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారని మంత్రులు హితవు పలికారు. తాజా బడ్జెట్ కేటాయింపులతో పెండింగ్ పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని వారు హామీ ఇచ్చారు.

ANN TOP 10