AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

2018 గ్రూప్-1 అధికారులపై హైకోర్టు వేటు: కీలక పోస్టుల నుంచి తక్షణమే తొలగింపు

ఏపీలో 2018 గ్రూప్-1 నియామకాల వివాదం మళ్లీ ముదిరింది. హైకోర్టు ఆదేశాల మేరకు కీలక పోస్టుల్లో (Focal Posts) కొనసాగుతున్న 2018 బ్యాచ్ అధికారులందరినీ తక్షణమే రిలీవ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు గతంలోనే ఈ నియామకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, అమలులో జాప్యం జరగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో రెండేళ్లుగా విధుల్లో ఉన్న 167 మంది అధికారుల భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఈ వివాదానికి ప్రధాన కారణం మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన అవకతవకలే. తొలుత డిజిటల్ పద్ధతిలో, ఆ తర్వాత మాన్యువల్ పద్ధతిలో మూల్యాంకనం నిర్వహించడంపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పారదర్శకత లేని పాత ఎంపిక జాబితాను రద్దు చేసి, ఆరు నెలల్లోగా కొత్తగా మూల్యాంకనం పూర్తి చేయాలని హైకోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. కొత్త జాబితా వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న వారిని కీలకమైన డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు, ఆర్టీఓలు వంటి కీలక బాధ్యతల్లో ఎలా కొనసాగిస్తారని కోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది.

హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జాప్యంపై సీఎస్ స్వయంగా కోర్టుకు హాజరైనప్పుడు న్యాయస్థానం చురకలు అంటించింది. బదిలీల కోసం ప్రభుత్వం కోరిన సమయాన్ని నిరాకరిస్తూ, తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీనితో రంగంలోకి దిగిన సీఎస్, 2018 బ్యాచ్ అధికారులందరినీ అప్రాధాన్య (Non-Focal) పోస్టుల్లోకి పంపాలని అన్ని శాఖల అధిపతులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిణామం అటు అధికారులలోనూ, ఇటు పాలనా యంత్రాంగంలోనూ పెద్ద చర్చకు దారితీసింది.

ANN TOP 10