మహిళల వస్త్రధారణపై కొద్ది నెలల క్రితం తాను చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ మరోసారి వివరణ ఇచ్చారు. ఆ రోజు మాట్లాడే క్రమంలో రెండు పదాలు పొరపాటున దొర్లాయని, అవి వాడకుండా ఉండాల్సిందని ఆయన అంగీకరించారు. వందలాది ప్రెస్ మీట్లు, డిబేట్లలో పాల్గొన్నా ఎప్పుడూ నోరు జారలేదని, కానీ ఆ రోజు ఎందుకు అలా మాట్లాడానో తనకే తెలియడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఆ సంఘటన తర్వాత తాను తీవ్ర మానసిక సంఘర్షణకు గురై, మూడు రోజులు నిద్ర కూడా పోలేదని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
యాంకర్ అనసూయను తాను ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదని శివాజీ స్పష్టం చేశారు. ఆమెతో తనకు పెద్దగా పరిచయం లేదని, గతంలో ఒకసారి ఇంటర్వ్యూ చేయడం తప్ప మరే ఇతర సంబంధం లేదని తెలిపారు. ఆమె అంటే తనకు గౌరవం ఉందని, మగవారు ఎవరూ ఆడవారిని కావాలని కించపరచాలని అనుకోరని ఆయన వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యల వెనుక ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం లేదని శివాజీ పునరుద్ఘాటించారు.
మహిళా కమిషన్‌కు తనపై ఫిర్యాదు చేసిన వారు తనకు తెలిసిన వారేనని తెలిసి షాక్‌కు గురైనట్లు శివాజీ పేర్కొన్నారు. వారి పేర్లు బయటకు చెప్పడం ఇష్టం లేదని, ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై తనకు గౌరవం తగ్గలేదని చెప్పారు. అన్ని రోజులు మనవి కావని ఆరోజు అర్థమైందని, జరిగిన దానికి తనకే ఇబ్బందిగా అనిపించిందని ఆయన వివరించారు.








