తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మే మొదటి వారంలో ఈ పార్టీని ప్రారంభించబోతున్నట్లు మీడియా చిట్‌చాట్‌లో వెల్లడించారు. తాను స్థాపించబోయే పార్టీ పేరులో కచ్చితంగా “తెలంగాణ” అనే పదం ఉంటుందని, బీఆర్ఎస్ (BRS) పేరు మార్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఒక “ఇంటి పార్టీ” లేకుండా పోయిందన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రత్యక్షంగా పోటీ చేస్తానని కవిత స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తన మొదటి ప్రాధాన్యత (First Choice) సిద్ధిపేట నియోజకవర్గమని, రెండో చాయిస్‌గా బోధన్‌ను ఎంచుకుంటానని వెల్లడించారు. సిద్ధిపేట గతంలో కేసీఆర్ కంచుకోటగా ఉండి, ప్రస్తుతం హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో, కవిత అక్కడ పోటీ చేస్తానని చెప్పడం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. హరీష్ రావును లక్ష్యంగా చేసుకునే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
గత 19 ఏళ్లుగా తెలంగాణ జాగృతి ద్వారా సామాజిక సేవలో ఉన్న తాను, ఇకపై రాజకీయ శక్తిగా ప్రజల పక్షాన పోరాడుతానని కవిత ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం కనుసన్నల్లో కాకుండా స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థను నిర్మిస్తానని చెప్పారు. ఏప్రిల్ లేదా మే నాటికి పార్టీ జెండా, ఎజెండా మరియు పూర్తిస్థాయి విధివిధానాలను వెల్లడించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.








