AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మదనపల్లె చిన్నారి హత్యాచార నిందితుడి ఆత్మహత్య….

మదనపల్లెలో మైనర్ బాలికపై అమానుషంగా హత్యాచారానికి పాల్పడిన ప్రధాన నిందితుడు కులవర్ధన్ విగతజీవిగా కనిపించాడు. బుధవారం (ఫిబ్రవరి 18, 2026) ఉదయం స్థానిక చెరువులో అతని మృతదేహం తేలియాడుతుండటాన్ని పోలీసులు గుర్తించారు. మంగళవారం బాలికపై దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకుని పరారైన కులవర్ధన్, శిక్ష పడుతుందనే భయంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ నిర్ధారించారు.

నిందితుడి ఆచూకీ కోసం జిల్లా యంత్రాంగం బుధవారం ఉదయం నుంచే భారీ గాలింపు చర్యలు చేపట్టింది. ప్రత్యేక బృందాలతో పాటు డ్రోన్లు, డాగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దించి మదనపల్లె పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. చివరకు చెరువులో శవమై తేలడంతో ఈ గాలింపు ముగిసింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు బతికి ఉంటే తానే చంపేదాన్ని అని, దేవుడే వాడికి తగిన శిక్ష వేశాడని మృతురాలైన బాలిక తల్లి ఆవేదనగా స్పందించింది.

నిందితుడు మరణించిన వార్త తెలియగానే మదనపల్లె వాసులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అభం శుభం తెలియని చిన్నారిని బలి తీసుకున్న కిరాతకుడికి తగిన గతి పట్టిందని వారు హర్షం వ్యక్తం చేశారు. రాక్షసుడు అంతమయ్యాడంటూ స్థానికులు వీధుల్లో టపాసులు కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ దారుణ ఘటనపై గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వెల్లువెత్తిన ఆగ్రహావేశాలు, నిందితుడి ఆత్మహత్యతో ఒక కొలిక్కి వచ్చినట్లయింది.

ANN TOP 10