మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ “మురుగు రాజకీయాలు” చేస్తోందని ఆయన మండిపడ్డారు. క్యాతన్‌పల్లిలో బీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, అధికార బలం మరియు ధన బలంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఛైర్మన్ పీఠాలను అడ్డదారుల్లో ఆక్రమించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.
దళిత నాయకుడైన బాల్క సుమన్ కాంగ్రెస్ అక్రమాలను అడ్డుకున్నందుకే కావాలని పోలీసులు ఆయనను నిర్బంధించారని హరీశ్ రావు ఆరోపించారు. కేవలం క్యాతన్‌పల్లిలోనే కాకుండా తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్ వంటి మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడిన చోట కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడుతోందని విమర్శించారు. జనగాంలో దళిత మహిళా కౌన్సిలర్‌పై దాడి జరుగుతుంటే పోలీసులు కళ్లప్పగించి చూశారే తప్ప అడ్డుకోలేదని, శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ఎక్స్ (X) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూములను కబ్జా చేసినట్లే, ఇప్పుడు రాజకీయ పీఠాలను కూడా కాంగ్రెస్ కబ్జా చేస్తోందని హరీశ్ రావు ఘాటుగా విమర్శించారు. చట్టాలను తుంగలో తొక్కి ప్రజా తీర్పును కాలరాస్తున్నారని, అధికారులు కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాల్క సుమన్ అరెస్ట్ దళిత సమాజంపై జరిగిన దాడి అని పేర్కొంటూ, తక్షణమే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ చేస్తున్న ఈ అరాచకాలను గమనిస్తోందని ఆయన హెచ్చరించారు.








