రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. మెజార్టీ స్థానాలను గెలుచుకుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు గట్టి షాకిచ్చింది. మొత్తం 24 వార్డులకు గాను బీఆర్ఎస్ 13 స్థానాలను కైవసం చేసుకోగా, ఈరోజు జరిగిన ఎన్నికల్లో టేకు సుదర్శన్ రెడ్డిని ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. అయితే, ఈ ఎన్నిక ప్రక్రియపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో సుదర్శన్ రెడ్డి నియామకంపై సందిగ్ధత నెలకొంది.
ఈ వివాదానికి ప్రధాన కారణం 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యం కావడం. తన తండ్రిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ యాదగిరి కుమారుడు హైకోర్టులో ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ దాఖలు చేశారు. కౌన్సిలర్ ఆచూకీ లేని నేపథ్యంలో ఎన్నిక నిర్వహించడం సరికాదని భావించిన న్యాయస్థానం, అదృశ్యమైన యాదగిరిని ఎల్లుండి తమ ఎదుట హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. అప్పటి వరకు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి యథాతథ స్థితిని (Status Quo) కొనసాగించాలని స్పష్టం చేసింది.
అయితే, హైకోర్టు నుంచి స్టే ఆదేశాలు అందే సమయానికే సుదర్శన్ రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. కానీ, న్యాయస్థానం ఆదేశాల దృష్ట్యా ఈ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కిడ్నాప్ ఆరోపణలు మరియు న్యాయస్థానం జోక్యంతో ఇబ్రహీంపట్నం మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కౌన్సిలర్ ఆచూకీ దొరికి, కోర్టులో హాజరుపరిచిన తర్వాతే ఈ ఎన్నికపై తదుపరి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.








