ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు కేవలం పుస్తకాల పురుగులుగా మారకుండా, శారీరకంగా కూడా దృఢంగా తయారవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకోసం ‘కామన్ ప్లే గ్రౌండ్ సిస్టమ్ (CPGS)’ అనే సరికొత్త విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌లను కోరుతూ శాసన మండలిలో కీలక ప్రసంగం చేశారు.
ఏమిటీ ‘కామన్ ప్లే గ్రౌండ్ సిస్టమ్’?
నేటి కాలంలో అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు కేవలం నాలుగు గోడల మధ్యే నడుస్తున్నాయని, వాటికి కనీస ఆటస్థలాలు కూడా లేవని నాగబాబు గుర్తు చేశారు. దీనివల్ల విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడటమే కాకుండా, దురదృష్టవశాత్తు ఆత్మహత్యల వంటి దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన మైదానాలు అందుబాటులో ఉన్నందున, ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు కూడా వాటిని వాడుకునేలా అవకాశం కల్పించాలని ప్రతిపాదించారు. దీనికోసం ప్రైవేట్ యాజమాన్యాల నుంచి స్వల్ప రుసుము వసూలు చేసి, ఆ మొత్తాన్ని ప్రభుత్వ పాఠశాలల మైదానాల నిర్వహణకు ఉపయోగించుకోవచ్చని ఆయన వివరించారు.
ఫిట్‌నెస్‌లో మోదీ, పవన్ కళ్యాణ్ ఆదర్శం
శారీరక దృఢత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను ఆయన ఉదాహరణలుగా చూపారు. 70 ఏళ్ల వయసులో కూడా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఎంతో చురుకుగా ఉంటూ యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని ప్రశంసించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పాలనా బాధ్యతల్లో ఉంటూనే మార్షల్ ఆర్ట్స్ సాధన చేస్తూ ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ వంటి అంతర్జాతీయ బిరుదులు సాధించడం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వారిని చూసి విద్యార్థులు ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
సిలబస్‌లో యోగా, సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి
స్వామి వివేకానంద చెప్పినట్లుగా “ఇనుప కండరాలు, ఉక్కు నరాలు” కలిగిన యువతను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యం కావాలని నాగబాబు కోరారు. వారంలో కనీసం మూడు రోజులైనా విద్యార్థులకు శారీరక వ్యాయామం, ఆటలు, యోగా, మార్షల్ ఆర్ట్స్ మరియు ఆత్మరక్షణ (సెల్ఫ్ డిఫెన్స్) విద్యలను తప్పనిసరి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యా సిలబస్‌లో వీటిని అంతర్భాగం చేయడం వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు మానసిక దృఢత్వం పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.








