బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో నలుగురు హిందూ అభ్యర్థులు ఎంపీలుగా గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించారు. తారిక్ రెహమాన్ నాయకత్వంలోని బీఎన్పీ తరఫున పోటీ చేసిన వీరు, మైనారిటీలపై దాడులు జరుగుతున్న క్లిష్ట సమయంలో విజయం సాధించడం గమనార్హం. వీరిలో ముఖ్యంగా బీఎన్పీ సీనియర్ నేత గాయేశ్వర్ చంద్ర రాయ్ ఢాకా-3 స్థానం నుండి జమాతే ఇస్లామీ అభ్యర్థిపై 99 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న రాయ్, పార్లమెంటులో హిందువుల గొంతుకను బలంగా వినిపిస్తారని భావిస్తున్నారు.
మరో ముగ్గురు హిందూ అభ్యర్థులు కూడా బీఎన్పీ తరఫున తమ పట్టు నిరూపించుకున్నారు. మగురా-2 నియోజకవర్గం నుండి బీఎన్పీ ఉపాధ్యక్షుడు నిత్య రాయ్ చౌదురి 30 వేల ఓట్ల మెజార్టీతో గెలవగా, రంగమతి నుండి లాయర్ దీపేన్ దేవాన్, బందర్‌బన్ స్థానం నుండి సచింగ్ ప్రూ లక్షకు పైగా ఓట్ల భారీ మెజార్టీతో చట్టసభకు ఎన్నికయ్యారు. వీరిలో ఇద్దరు హిందూ అభ్యర్థులు అతివాద జమాతే ఇస్లామీ అభ్యర్థులను ఓడించడం విశేషం. అయితే, జమాతే ఇస్లామీ తరఫున పోటీ చేసిన ఏకైక హిందూ అభ్యర్థి కృష్ణ నంది ఓటమి పాలయ్యారు.
మొత్తం 300 స్థానాలకు గాను బీఎన్పీ 212 స్థానాల్లో ఘనవిజయం సాధించి స్పష్టమైన మెజార్టీని పొందింది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌పై నిషేధం విధించడంతో ఆ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. జమాతే ఇస్లామీ 70 స్థానాలను దక్కించుకుంది. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బీఎన్పీ అధికారంలోకి రావడం, అందులోనూ హిందూ ప్రతినిధులు గణనీయమైన సంఖ్యలో గెలవడం బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపుగా పరిగణించబడుతోంది.








