సైబర్ నేరగాళ్లు సరికొత్తగా సృష్టించిన ‘డిజిటల్ అరెస్ట్’ అనే స్కామ్ పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. నేరగాళ్లు పోలీస్ అధికారులుగా, సీబీఐ లేదా ఈడీ అధికారుల తరహాలో దుస్తులు ధరించి వీడియో కాల్స్ చేస్తూ ప్రజలను భయపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మీ పేరుతో డ్రగ్స్ పార్శిల్స్ వచ్చాయని లేదా అక్రమ లావాదేవీలు జరిగాయని నమ్మిస్తూ, వీడియో కాల్‌లోనే మిమ్మల్ని బంధీలుగా ఉంచుతామని (డిజిటల్ అరెస్ట్) బెదిరిస్తూ భారీగా డబ్బులు వసూలు చేయడం ఈ ముఠాల పని అని వివరించారు.
భారతీయ శిక్షాస్మృతి లేదా ఏ ఇతర చట్టాల్లోనూ ‘డిజిటల్ అరెస్ట్’ అనే పదమే లేదని సీపీ స్పష్టం చేశారు. పోలీసులు ఎప్పుడూ వాట్సాప్ ద్వారా లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ జరపరని, ఫోన్లలో డబ్బులు డిమాండ్ చేయరని ఆయన గుర్తు చేశారు. చదువుకున్న వారు సైతం ఈ భయం కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోవడం ఆందోళనకరమని, గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఇలాంటి కాల్స్‌ను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు.
హైదరాబాద్ పోలీసులు చేపట్టిన ‘జాగృత్ హైదరాబాద్ – సురక్షిత్ హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సీపీ పిలుపునిచ్చారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి కాల్స్ చేసి భయపెట్టాలని చూస్తే, వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయాలని కోరారు. ఈ స్కామ్ గురించి ఇతరులకు కూడా వివరించి, సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.








