మహా శివరాత్రి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది శివతత్వం మరియు శక్తి ఏకమయ్యే అద్భుత సమయమని శ్రీశ్రీ రవిశంకర్ పేర్కొన్నారు. శివుడు ఎవరో ఎక్కడో లేరని, ఆయన మన అంతరాత్మ స్వరూపమేనని ఆయన వివరించారు. ‘శివ’ అంటే మంగళకరుడు, శుభకరుడు అని అర్థం. దివ్యత్వపు ఒడిలో మనసు విశ్రాంతి పొందినప్పుడే అది నిజమైన విశ్రాంతి అవుతుందని, దీనినే కబీర్ దాస్ ‘కోటికల్ప విశ్రాంతి’ (ఒక క్షణంలో కోట్లాది సంవత్సరాల విశ్రాంతి పొందే స్థితి) అని చెప్పారని గుర్తు చేశారు.
శివరాత్రి రోజున చేసే ‘జాగరణ’ గురించి ఆయన సరికొత్త నిర్వచనం ఇచ్చారు. జాగరణ అంటే కేవలం నిద్రపోకుండా ఉండటం లేదా భజనలు చేయడం మాత్రమే కాదని, అంతర్ముఖంగా ‘జాగరూకత’తో ఉండటమని తెలిపారు. నిద్ర అనేది అచేతనంగా పొందే విశ్రాంతి అయితే, సమాధి లేదా శివ సాయుజ్యం అనేది సంపూర్ణ ఎఱుకతో కూడిన గాఢమైన విశ్రాంతి అని ఆయన వివరించారు. ఈ స్థితి బంధాల నుంచి విముక్తిని కలిగించి, మనసులో ఒక ప్రత్యేకమైన తాజాతనాన్ని, ఆనందాన్ని నింపుతుందని పేర్కొన్నారు.
శివలింగ ఆరాధన వెనుక ఉన్న గూఢార్థాన్ని వివరిస్తూ, ‘లింగ’ అంటే ఒక చిహ్నం అని, దివ్యత్వం బాహ్య భేదాలకు అతీతమైనదని ఆయన అన్నారు. శివుడు సంహారకర్త మాత్రమే కాదు, పాతది నశించి కొత్త మార్పు రావడానికి కారకుడని వివరించారు. సృష్టి అంతా శివుని నృత్యమేనని (శివ తాండవం), ఈ జగత్తే ఒక మంగళకరమైన లయలో కదిలే శివరూపమని కొనియాడారు. చైతన్యంలో అద్వైత మహిమను అనుభవించడమే శివరాత్రి సారాంశమని, అచేతనమైన నిద్రను వదిలి సార్వత్రిక చైతన్యంతో మమేకం కావాలని గురుదేవ్ పిలుపునిచ్చారు.








