తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ భారీ ఎత్తున సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 1.31 కోట్ల మంది అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ. 5,000 నగదును జమ చేశారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన ‘మగలిర్ ఉరిమై తొగై’ (మహిళల హక్కుల మొత్తం) కింద రూ. 3,000 మరియు వేసవి కాలపు ప్రత్యేక ప్యాకేజీ కింద మరో రూ. 2,000 కలిపి మొత్తం రూ. 5,000ను ప్రభుత్వం పంపిణీ చేసింది. గతంలో ప్రధాని మోదీ బీహార్ ఎన్నికల ముందు అనుసరించిన వ్యూహాన్ని స్టాలిన్ ఇప్పుడు తమిళనాడులో అమలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అయితే, ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొద్దిరోజుల ముందు ఇలా భారీ మొత్తంలో నగదు పంపిణీ చేయడం ఓటర్లను ప్రలోభ పెట్టడమేనని బీజేపీ ఆరోపించింది. అటు రాజకీయ అరంగేట్రం చేసిన నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ కూడా ఈ పథకాన్ని తీవ్రంగా విమర్శించింది. ప్రజలకు శాశ్వత ఉపాధి కల్పించకుండా, కేవలం తాత్కాలిక తాయిలాలతో మోసం చేస్తున్నారని విజయ్ విమర్శించారు. ప్రభుత్వ ఖజానాపై విపరీతమైన భారం పడుతున్నా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే డీఎంకే ఈ చర్యలకు దిగిందని ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి.
డీఎంకే శ్రేణులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నాయి. మహిళా సాధికారత మరియు ఆర్థిక స్వావలంబన కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ఇది అందులో భాగమేనని సమర్థించుకుంటున్నారు. ఎన్నికల ముందు మహిళల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ నగదు బదిలీ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందోనని విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ భారీ నగదు పంపిణీ స్టాలిన్‌కు రాజకీయంగా ఎంతవరకు కలిసివస్తుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.








