AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఒక్క ఓటుతో మారిన తలరాత: కల్వకుర్తి, పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థుల సంచలన విజయం!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో అభ్యర్థుల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. కొన్ని చోట్ల కేవలం ఒక్క ఓటు తేడాతో అభ్యర్థుల జయాపజయాలు ఖరారు కావడం విశేషం. కల్వకుర్తి మున్సిపాలిటీలోని పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్ మరియు బీఆర్ఎస్ అభ్యర్థి తాహిర్ మధ్య విజయం దోబూచులాడింది. మొదటి రౌండ్ లెక్కింపులో ఎజాస్ కు స్వల్ప మెజారిటీ రాగా, ప్రత్యర్థి అభ్యర్థి రీకౌంటింగ్ కోరారు. అధికారులు రెండోసారి క్షుణ్ణంగా లెక్కించగా, ఎజాస్ కు 259 ఓట్లు, తాహిర్ కు 258 ఓట్లు వచ్చాయి. దీంతో కేవలం ఒక్క ఓటు మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ధృవీకరించారు.

ఇదే తరహా ఫలితం హనుమకొండ జిల్లాలోని పరకాల మున్సిపాలిటీలోనూ పునరావృతమైంది. పరకాల 17వ వార్డు ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్రకు 369 ఓట్లు రాగా, ఆమె సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి శనిగరపు రజినికి 368 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కూడా రీకౌంటింగ్ చేపట్టినప్పటికీ ఫలితంలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో ఒక్క ఓటు తేడాతో బొచ్చు సుభద్ర విజేతగా నిలిచారు. ప్రతి ఓటు ఎంత విలువైందో, అది అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును ఎలా మారుస్తుందో ఈ ఫలితాలు నిరూపించాయి.

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఫలితాలు వెలువడుతున్న తరుణంలో, అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ సుమారు 75 శాతానికి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కొన్ని జిల్లాల్లో గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో మాత్రమే తన పట్టును నిలుపుకోగలిగింది. ఫిబ్రవరి 16న జరిగే మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నికపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

ANN TOP 10