తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుండగా, అనూహ్యంగా జనసేన పార్టీ కూడా తెలంగాణ గడ్డపై తన ఉనికిని చాటుకుంది. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన అభ్యర్థి ఘనవిజయం సాధించి, ఆ పార్టీ తరపున తెలంగాణలో తొలి మున్సిపల్ వార్డును కైవసం చేసుకున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరిగిన ఈ భారీ ఎన్నికల పోరులో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటున్న తరుణంలో, జనసేన బోణీ కొట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన అర్రూరి విజయలక్ష్మి విజయం సాధించారు. ఈమె ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన అధ్యక్షుడు సరికొప్పుల నాగేశ్వరరావు సతీమణి కావడంతో ఈ విజయం పార్టీకి మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. మొత్తం 15 వార్డులున్న నేరేడుచర్లలో కాంగ్రెస్ 9 వార్డులతో మెజారిటీ సాధించగా, బీఆర్ఎస్ 5 స్థానాలను దక్కించుకుంది. మిగిలిన ఒక స్థానంలో జనసేన జెండా ఎగురవేసి, తెలంగాణ గడ్డపై తమ రాజకీయ ప్రస్థానానికి బలమైన పునాది వేసుకున్నట్లయింది.
తెలంగాణవ్యాప్తంగా జనసేన పార్టీ మొత్తం 336 వార్డుల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండటం వల్ల ప్రచారానికి రాకపోయినప్పటికీ, జనసైనికులు క్షేత్రస్థాయిలో కష్టపడి ఈ విజయాన్ని సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికి పైగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ చిన్న విజయం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నేరేడుచర్ల గెలుపు తెలంగాణలో జనసేన భవిష్యత్తుకు శుభసూచకమని కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.








