AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ పునర్నిర్మాణం గాడిన పడింది: అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆశాభావం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఒత్తిడిని అధిగమించి వృద్ధి పథంలోకి తిరిగి వస్తోందని గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. గత 21 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో మౌలిక సంస్కరణలు పూర్తి చేసి, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియను పటిష్టం చేసినట్లు ఆయన తెలిపారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రాష్ట్ర విశ్వసనీయత పెరిగిందని, ‘స్వర్ణాంధ్ర-2047’ దార్శనికతతో ముందుకు సాగుతున్నామని వివరించారు. ఈ ప్రసంగం ద్వారా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల రోడ్ మ్యాప్‌ను ఆయన సభ ముందు ఉంచారు.

రాష్ట్ర ఆర్థిక గణాంకాలను వివరిస్తూ.. ఏపీ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) గణనీయంగా పెరిగిందని గవర్నర్ వెల్లడించారు. 2025-26 ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.17.62 లక్షల కోట్లకు చేరిందని, ఇది 10.75 శాతం వృద్ధిని సూచిస్తోందని తెలిపారు. అలాగే, తలసరి ఆదాయం రూ.2.66 లక్షల నుంచి రూ.2.95 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు. వ్యవసాయం (7.83%), పరిశ్రమలు (9.53%), సేవల రంగం (12.94%) వృద్ధి పథంలో ఉన్నాయని ఆయన గణాంకాలతో సహా వివరించారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో పురోగతి కనిపిస్తోందని భరోసా ఇచ్చారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ, వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు ప్రభుత్వం 7 శ్వేతపత్రాలను విడుదల చేసిందని గవర్నర్ గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు పట్టాలు తప్పడం, అమరావతి వినాశనం, విద్యుత్ రంగం విధ్వంసం వంటి అంశాలను ఈ పత్రాల ద్వారా వివరించామన్నారు. అధికారం చేపట్టిన వెంటనే ‘సూపర్ సిక్స్’ హామీల అమలుకు శ్రీకారం చుట్టామని, ప్రతి పౌరుడూ గౌరవంగా బతికేలా అవకాశాలను సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ తన ప్రసంగంలో ఆకాంక్షించారు.

ANN TOP 10