రాష్ట్రంలో సుస్థిరమైన అభివృద్ధి సాధ్యపడాలంటే గుజరాత్ తరహాలో ఒకే ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. మంగళవారం జరిగిన ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకే ప్రభుత్వం వరుసగా అధికారంలో ఉంటేనే విధానపరమైన నిర్ణయాలు ఫలితాలను ఇస్తాయని, గుజరాత్‌లో బీజేపీ ఐదుసార్లు గెలిచి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిందని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరో 15 ఏళ్ల పాటు కలిసి ఉంటేనే రాష్ట్రం గాడిన పడుతుందని, రాజకీయాల్లో శాశ్వతంగా నిలబడగలమని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లే వెంటిలేటర్‌పై ఉన్న ఆంధ్రప్రదేశ్ వేగంగా కోలుకుంటోందని ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటివి కేంద్ర నిధులతోనే మళ్లీ వేగం పుంజుకున్నాయని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టేందుకు కేంద్రం తన పాలసీని మార్చుకోవడం వల్ల, చరిత్రలో మొదటిసారిగా ప్లాంట్ ఒక్క నెలలో రూ.54 కోట్ల లాభాన్ని గడించిందని వెల్లడించారు. 2027 జూన్ నాటికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ, ఈ ప్రభుత్వ విజయాలను ప్రతి ఎమ్మెల్యే సొంతం చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు.
అసెంబ్లీ సమావేశాల పట్ల ఎమ్మెల్యేలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రతి సభ్యుడు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తప్పనిసరిగా సభలో ఉండాలని, అర్థవంతమైన చర్చల్లో పాల్గొనాలని సూచించారు. “ఎదుటివారు తిట్టారని మనం బూతులు తిట్టకూడదు, ప్రజామోదయోగ్యంగా సభను నడుపుదాం” అని హితవు పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ, పార్టీల మధ్య ఏవైనా భిన్నాభిప్రాయాలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని, కూటమి ధర్మానికి కట్టుబడి పనిచేయాలని నేతలకు సూచించారు.








