సిట్ నివేదికపై తప్పుడు ప్రచారం
తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సిట్ (SIT) ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. లడ్డూ అంశంలో రాజకీయ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని దర్యాప్తు సంస్థలు స్పష్టం చేసినప్పటికీ, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తోందని ఆయన విమర్శించారు. చంద్రబాబు ప్రస్తుతం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారని, అందుకే నిజాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
స్వాముల ద్వారా ‘లేఖల రాజకీయాలు’
ఆధ్యాత్మికవేత్తలను సైతం చంద్రబాబు తన రాజకీయ క్రీడలోకి లాగుతున్నారని భూమన ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది స్వాములను భయపెట్టి, వారిపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా లేఖలు రాయిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా పెద్ద జీయర్ స్వామి వంటి వారిని కూడా భయపెట్టే స్థాయికి ‘రెడ్ బుక్ పాలన’ వెళ్లిందని విమర్శించారు. ఆధ్యాత్మికవేత్తలు ఈ క్షుద్ర రాజకీయాల్లో నలిగిపోవడం బాధాకరమని, చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం భక్తిని కూడా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఎల్లో మీడియా దాడి – దర్యాప్తుపై ఒత్తిడి
దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలు తమకు అనుకూలంగా లేకపోవడంతో, చంద్రబాబు వర్గ మీడియా ఆ సంస్థలపై దాడి చేస్తోందని భూమన మండిపడ్డారు. హైందవ సమాజానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కల్తీ జరగలేదని సిట్ నివేదికలు చెబుతున్నా, పాత అంశాలను తెరపైకి తెస్తూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తి కంటే పైరవీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కొంతమందిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.








