తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు బరితెగించి ప్రలోభాలకు తెరలేపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని చేవెళ్ల పరిధిలో ఓ అభ్యర్థి తాను గెలిస్తే ఓటర్లకు ‘అర తులం బంగారం’ ఇస్తానని ప్రకటించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యంలో ఓటును ఈ స్థాయిలో వేలం పెట్టడంపై సామాజిక విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR) పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో డబ్బు ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది. ఒక్కో ఓటుకు కనీసం రూ. 10 వేల నుంచి గరిష్టంగా రూ. 30 వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగే ప్రాంతాల్లో కౌన్సిలర్ పదవి కోసం అభ్యర్థులు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. కేవలం నగదు మాత్రమే కాకుండా మద్యం, మాంసం విందులతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక బహుమతుల విషయానికొస్తే.. గృహోపకరణాల పంపిణీ జోరుగా సాగుతోంది. టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, కుక్కర్లు వంటి ఖరీదైన వస్తువులను ఓటర్ల ఇళ్లకు చేరుస్తున్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇలా భారీగా డబ్బు వెదజల్లి గెలిచిన అభ్యర్థులు పదవిలోకి వచ్చాక అభివృద్ధిని పక్కనపెట్టి, అక్రమ సంపాదనకే ప్రాధాన్యత ఇస్తారని, ఇది ప్రజాస్వామ్యానికి పెను ముప్పు అని మేధావులు హెచ్చరిస్తున్నారు.








