ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. 1989లో బాధ్యతలు చేపట్టిన నాటి నుండి, అంటే గత 37 ఏళ్లుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 8న ఎయిర్ ఫోర్స్ కమాండర్లతో భేటీ అయ్యే ఆచారాన్ని ఆయన పాటిస్తున్నారు. చివరికి యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, కరోనా వంటి గడ్డు కాలంలోనూ కొనసాగిన ఈ చారిత్రక సంప్రదాయాన్ని ఈ ఏడాది ఖమేనీ అకస్మాత్తుగా పక్కన పెట్టారు. ఆయనకు బదులుగా సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీమ్ మూసవి ఈ సమావేశానికి హాజరు కావడం గమనార్హం.
ఈ పరిణామం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన తీవ్ర హెచ్చరికలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గల్ఫ్ జలాల్లో అమెరికా యుద్ధ నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ సంచారం పెరగడం, జోర్డాన్ వంటి దేశాల్లో అమెరికా తన ఎఫ్-15 యుద్ధ విమానాలు మరియు రీపర్ డ్రోన్లను భారీగా మోహరించడం ఇరాన్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. బహిరంగంగా కనిపిస్తే శత్రు దేశాల డ్రోన్ల నిఘాలో ‘టార్గెట్’ అయ్యే అవకాశం ఉందని భావించి, భద్రతా కారణాల దృష్ట్యా ఖమేనీ అజ్ఞాతంలోకి లేదా బంకర్‌లోకి వెళ్లినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఇరాన్ అణు కార్యక్రమంతో పాటు క్షిపణి వ్యవస్థపై కూడా చర్చలు జరపాలని అమెరికా పట్టుబడుతుండగా, ఇరాన్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఈ ప్రతిష్టంభన నేపథ్యంలో ట్రంప్ ఎప్పుడైనా వైమానిక దాడులకు ఆదేశించవచ్చనే భయం ఇరాన్ పాలకుల్లో నెలకొంది. గత ఏడాది ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధం తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఖమేనీ తన బహిరంగ పర్యటనలను రద్దు చేసుకుని, భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసుకున్నట్లు సమాచారం.









