ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సెక్స్ రాకెట్ సూత్రధారి జెఫ్రీ ఎప్‌స్టీన్ మరణంపై మరోసారి తీవ్ర వివాదం నెలకొంది. 2019 ఆగస్టు 10న మాన్‌హట్టన్ జైలులో ఎప్‌స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించినప్పటికీ, తాజాగా బయటకు వచ్చిన అమెరికా న్యాయశాఖ (DOJ) పత్రాలు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఎప్‌స్టీన్ మరణించినట్లు ప్రకటించే అధికారిక డ్రాఫ్ట్ స్టేట్‌మెంట్‌పై ఉన్న తేదీ, అతను చనిపోయిన రోజు కంటే ఒక రోజు ముందుది (ఆగస్టు 9, 2019) కావడమే ఈ చర్చకు ప్రధాన కారణం.
అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన లక్షలాది పేజీల ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ (EFTA) ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 10 తెల్లవారుజామున 6:30 గంటలకు గార్డులు అతడిని విగతజీవిగా గుర్తించారని రికార్డులు చెబుతుండగా, అంతకుముందే “ఎప్‌స్టీన్ మరణించాడు” అని పేర్కొనే స్టేట్‌మెంట్ సిద్ధంగా ఉండటం కుట్ర కోణాలకు బలాన్నిస్తోంది. ఇది కేవలం క్లరికల్ పొరపాటా లేక ముందుగానే ప్లాన్ చేసిన మరణమా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా, చనిపోయిన తర్వాత తీసిన ఫొటోల్లో అతని పేరును తప్పుగా రాయడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ఎప్‌స్టీన్ మరణించడానికి కొన్ని గంటల ముందు జైలులోని సీసీటీవీ కెమెరాలు మొరాయించడం, అప్పటికే అతని సెల్‌మేట్‌ను వేరే చోటికి మార్చడం వంటివి గతంలోనే వివాదాస్పదమయ్యాయి. తాజాగా వెలుగుచూసిన వీడియో దృశ్యాల్లో ఒక ‘ఆరెంజ్ రంగు దుస్తులు’ ధరించిన వ్యక్తి ఎప్‌స్టీన్ గది వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఎప్‌స్టీన్ మరణం వెనుక ఉన్న రహస్యాలు బయటకు రాకుండా పెద్దలు ఎవరైనా చక్రం తిప్పారా అన్న కోణంలో ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.









