AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఫైర్: “సిరిసిల్లలో ఆయనకు ఎండ్ కార్డ్ ఖాయం”

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాడుతున్న భాషపై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ అహంకారపూరిత ప్రవర్తన వల్లే కేసీఆర్ రాజకీయంగా నష్టపోయారని, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేటీఆర్ అడ్డంకిగా మారారని అద్దంకి దయాకర్ ఆరోపించారు. కేటీఆర్ తన పార్టీని తానే అంతం చేసుకుంటున్నారని, ఆయన చేసే సిగ్గుమాలిన పనులకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగుస్తుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ జోస్యం చెప్పారు. ముఖ్యంగా సిరిసిల్లలో బీఆర్ఎస్‌ను ప్రజలు చిత్తుగా ఓడించబోతున్నారని, ఆ భయంతోనే కేటీఆర్ అసహనంతో సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. అమెరికాలో అంట్లు కడుక్కునే వ్యక్తిని తీసుకొచ్చి కేసీఆర్ పదవి ఇచ్చారని ఎద్దేవా చేస్తూ, ఉద్యమకారులను తొక్కి కేటీఆర్ ఎదిగారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ రాజకీయ జీవితం క్లైమాక్స్‌కు చేరుకుందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి అసలు కేటీఆర్‌ను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్‌లు, అక్రమాలకు పాల్పడిన చరిత్ర కేటీఆర్‌దేనని, ఇప్పుడు అవేవీ సాగకపోవడంతోనే బజారు రౌడీలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సొంత చెల్లెలు కవిత అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేని వ్యక్తి, ప్రభుత్వంపై నీతులు చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల తీర్పుతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా తెరపడుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు.

ANN TOP 10