వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయి, ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సమయంలో జగన్ కనీసం ఒక ట్వీట్ కూడా చేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. “రామమందిరంపై మీ స్టాండ్ ఏంటో చెప్పే దమ్ముందా?” అని ప్రశ్నిస్తూ, హిందూ ధర్మం పట్ల వైసీపీ వైఖరిని ఎండగట్టారు. గతంలో రామతీర్థంలో విగ్రహం ధ్వంసమైనా, అంతర్వేది రథం దహనమైనా అప్పటి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
తిరుమల డిక్లరేషన్ అంశంపై స్పందిస్తూ, దివంగత అబ్దుల్ కలాం వంటి మహోన్నత వ్యక్తులే నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శించుకున్నారని నాగబాబు గుర్తు చేశారు. “అబ్దుల్ కలాం కంటే జగన్ గొప్ప వ్యక్తినా?” అని ప్రశ్నిస్తూ, కేవలం డిక్లరేషన్ అడిగారన్న కారణంతో తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడం జగన్ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన కుమార్తెతో కూడా డిక్లరేషన్ ఇప్పించి నిబంధనలను గౌరవించారని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తాను ఒక సగటు భారతీయుడిగా, నిఖార్సైన సనాతన హిందువుగా తన ధర్మాన్ని గౌరవిస్తానని నాగబాబు స్పష్టం చేశారు. హిందూ మతం అనేది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, అది ఒక భౌగోళిక అస్తిత్వమని (Geographical Identity) ఆయన అభివర్ణించారు. వైసీపీ నాయకులు సినిమాలకు రివ్యూలు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధను భక్తిపై చూపడం లేదని, తిరుమలలో వసతి ఛార్జీలు పెంచి సామాన్య భక్తులకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.








