మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజనిపై పోలీసులు కేసు నమోదు చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తనపై కేసు నమోదైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చట్టాలను చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారని, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లిన తనపై, తన అనుచరులపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు దాడి చేయించారని రజని ఆరోపించారు. తమపై దాడి చేయడమే కాకుండా, తిరిగి తమపైనే కేసులు పెట్టించడం దారుణమని ఆమె దుయ్యబట్టారు. రాష్ట్రంలో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం నడుస్తోందని, మాజీ మంత్రులకే రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. బీసీ మహిళ అయిన తనపై పదేపదే దాడులకు తెగబడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక తిరుమల లడ్డూ వివాదంపై స్పందిస్తూ, లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ ఇప్పటికే స్పష్టం చేసిందని రజని పేర్కొన్నారు. ఈ విషయంలో అబద్ధాలు ప్రచారం చేసినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోందని, అందుకే తమ పార్టీ నేతలైన అంబటి రాంబాబు, జోగి రమేష్‌లపై పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.









