AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జైలులో అంబటి.. బయట కుమార్తె పోరు: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన మౌనిక!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో జైలులో ఉన్న తన తండ్రిని పరామర్శించిన అనంతరం అంబటి కుమార్తె మౌనిక మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన రాజకీయ బలంతోనే తమ ఇంటిపై దాడులు జరుగుతున్నాయని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కాపు మహిళలమైన తమపై సొంత కులస్థులే దాడి చేయడం దారుణమని, పవన్ కల్యాణ్ అండ చూసుకునే కొందరు ఈ అరాచకాలకు పాల్పడుతున్నారని మౌనిక ఆరోపించారు. “మహిళల రక్షణ గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ గారూ.. మా ఇంటిపై రాడ్లు, కర్రలతో దాడి చేస్తుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తోంది?” అంటూ నిలదీశారు. కాపులంతా పవన్ వైపు ఉన్నారన్న ధీమాతో మహిళలపై బూతు పురాణం విప్పుతున్నారని, ఈ దాడులకు పవన్ పరోక్షంగా బలమిస్తున్నారని ఆమె విమర్శించారు.

మరోవైపు రాష్ట్ర హోంమంత్రి అనిత వైఫల్యంపై కూడా ఆమె ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ విషయంలో వాస్తవాలు మాట్లాడినందుకే తన తండ్రిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు కూడా వైఎస్ జగన్‌ను ఎన్నోసార్లు విమర్శించారని, ఇప్పుడు ప్రశ్నిస్తే మాత్రం ఇళ్లపై దాడులు చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం అని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.

ANN TOP 10