AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

“విమానాలు ఫిట్‌గానే ఉన్నాయి.. సర్వీసులు ఆపే ప్రసక్తే లేదు”: విఎస్ఆర్ ఏవియేషన్ యజమాని సంచలన వ్యాఖ్యలు!

అజిత్ పవార్ ప్రయాణించిన విమానం ప్రమాదానికి గురైన నేపథ్యంలో, ‘లియర్ జెట్-45’ మోడల్ విమానాల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 2023లోనూ ఇదే రకమైన విమానం ముంబైలో ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తు చేస్తూ, మిగిలిన విమానాలను నిలిపివేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. వీఎస్ఆర్ ఏవియేషన్ అధినేత వీకే సింగ్ స్పష్టతనిచ్చారు. తమ విమానాల ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామని, అవి ప్రయాణాలకు అత్యంత అనువుగా ఉన్నప్పుడు నిలిపివేయాల్సిన అవసరం లేదని ఆయన ఎదురు ప్రశ్నించారు.

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పైలట్ల సామర్థ్యంపై కూడా ఆయన కీలక వివరాలు వెల్లడించారు. విమానాన్ని నడిపిన కెప్టెన్ సుమిత్ కపూర్‌కు 16,000 గంటలకు పైగా విమానాలను నడిపిన అపార అనుభవం ఉందని, అలాగే కో-పైలట్ శాంభవి పాఠక్‌కు 1,500 గంటల అనుభవం ఉందని తెలిపారు. అనుభవజ్ఞులైన పైలట్లు ఉన్నప్పటికీ, బారామతిలో జరిగిన ఈ దుర్ఘటన వెనుక సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో డీజీసీఏ (DGCA) విచారణ జరుపుతోంది.

మరోవైపు, డీజీసీఏ అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రమాదానికి ముందు పైలట్ల నుండి ఎటువంటి ‘ఎమర్జెన్సీ కాల్’ రాలేదని తెలుస్తోంది. దీంతో ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. అజిత్ పవార్ మరణంపై ఒకవైపు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తుండగా, మరోవైపు విమానయాన సంస్థ యజమాని వ్యాఖ్యలు భద్రతా ప్రమాణాలపై కొత్త చర్చకు దారితీశాయి. విమాన తయారీ లోపమా లేక వాతావరణ పరిస్థితులా అనే నిజాలు బ్లాక్ బాక్స్ లభ్యమైతేనే తెలిసే అవకాశం ఉంది.

ANN TOP 10