నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) ప్రాంతంలో అత్యంత పాశవికమైన హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. కేవలం కొన్ని తులాల బంగారం కోసం ఓ నిరుపేద వ్యవసాయ కూలీని నమ్మించి, గొంతు కోసి చంపిన ఘోర కలికాలం ఇది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాములు–ధనలక్ష్మి దంపతులు, వారి కుమారుడు సాయి కుమార్ కలిసి 67 ఏళ్ల సుంకిరెడ్డి అనసూయమ్మ అనే వృద్ధురాలిని పథకం ప్రకారం అంతమొందించారు. నిందితుల అప్పుల బాధ తీర్చుకోవడానికి ఇంతటి దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘాతుకానికి నిందితులు వేసిన ప్లాన్ విని పోలీసులే విస్తుపోయారు. రేషన్ బియ్యానికి సంబంధించి బాకీ ఉన్న కేవలం రూ. 300 చెల్లిస్తామని అనసూయమ్మను నమ్మించి తమ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు రప్పించారు. ఆమె అక్కడకు రాగానే ఒక్కసారిగా దాడి చేసి, తలపై బలంగా కొట్టి, గొంతు కోసి ప్రాణాలు తీశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలను దొంగిలించారు. మృతదేహం బయటపడకుండా ఉండేందుకు అదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోపలే గొయ్యి తీసి పూడ్చిపెట్టడం వారి కిరాతకత్వానికి పరాకాష్ట.
అనసూయమ్మ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి నిందితుల గుట్టురట్టు చేశారు. దర్యాప్తులో నిందితులు చేసిన నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అప్పుల బాధతో ఉన్న వ్యక్తులు సామాన్య కూలీల ప్రాణాలను తీయడం చూస్తుంటే సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.









