AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమెరికా ‘గ్రోత్ ఇంజన్’ వెనుక అసలు రహస్యం: ప్రపంచ దేశాల సహకారం వల్లే అగ్రరాజ్య మనుగడ!

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అమెరికా ఒక ‘గ్రోత్ ఇంజన్’ అని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రగల్బాలు పలుకుతున్నప్పటికీ, వాస్తవానికి అమెరికా ఆర్థిక బలం అనేక ఇతర దేశాల వనరులు మరియు నైపుణ్యంపై ఆధారపడి ఉంది. భారత్ నుండి వెళ్తున్న సాఫ్ట్‌వేర్, ఆరోగ్య మరియు పరిశోధనా నిపుణులు అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుండగా, చైనా తయారీ రంగం మరియు సరఫరా గొలుసుల ద్వారా అమెరికాకు వెన్నెముకగా నిలుస్తోంది. మెక్సికో, కెనడాలు వ్యవసాయం మరియు ఇంధన భద్రతను అందిస్తుంటే, జర్మనీ, జపాన్ వంటి దేశాలు అత్యాధునిక సాంకేతికత మరియు సెమీకండక్టర్లను సరఫరా చేస్తూ అమెరికా మార్కెట్‌ను నడిపిస్తున్నాయి.

ఆర్థికంగానే కాకుండా రక్షణ పరంగా కూడా అమెరికా తన మిత్రదేశాలైన నాటో (NATO) సభ్యులు, జపాన్ మరియు ఇజ్రాయెల్‌పై గణనీయంగా ఆధారపడుతోంది. పెంటగాన్ వ్యయాన్ని ఏకంగా 50 శాతం పెంచి 1.5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది, ఇది దాదాపు రూ. 135 లక్షల కోట్లకు సమానం. అయితే అమెరికా తన సైనిక పాఠవాన్ని పూర్తిగా ప్రైవేటీకరించిందని, కేవలం ఐదుగురు కాంట్రాక్టర్ల చేతుల్లోనే రక్షణ సరఫరాలు ఉండటం వల్ల వారు భారీ లాభాలను ఆర్జిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంధన వనరులు ఉన్న దేశాల్లో ‘ప్రజాస్వామ్యం’ పేరుతో అమెరికా చేసే సైనిక జోక్యాలు తరచుగా ఆ దేశ ఆర్థిక ప్రయోజనాల కోసమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా భారత్ వంటి దేశాల నుంచి ప్రతి ఏటా లక్షలాది మంది మేధావులు, వైద్యులు మరియు ఇంజనీర్లు అమెరికాకు వలసపోతున్నారు. వారి విద్య కోసం భారత్ వేల కోట్లు ఖర్చు చేస్తుంటే, ఆ ప్రతిభ మాత్రం అమెరికా ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోంది. మన దేశంలో సరైన ఉపాధి మరియు పెట్టుబడి అవకాశాలు లేకపోవడం వల్లే ఈ ‘మేధో వలస’ (Brain Drain) జరుగుతోందని, మన యువత నైపుణ్యం అంతా అమెరికా ప్రయోజనాలకే ఉపయోగపడటం బాధాకరమని డాక్టర్ ఎనుగొండ నాగరాజ నాయుడు తన విశ్లేషణలో పేర్కొన్నారు. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థను కాపాడుకోవడానికి అమెరికా ఇతర దేశాలను దోచుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ANN TOP 10