AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

క్రెడిట్ చోరీ అనేవారికి అసలు క్రెడిట్ ఎక్కడిది?: నగరి వేదికగా వైసిపిపై సీఎం చంద్రబాబు నిప్పులు

చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల రాక్షస పాలనలో రాష్ట్రం అన్ని విధాలా అతలాకుతలమైందని, ప్రజలకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, తాము ‘క్రెడిట్ చోరీ’ చేస్తున్నామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “అసలు రాష్ట్రానికి ద్రోహం చేసిన వారికి క్రెడిట్ ఎక్కడిది?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ముఖ్యంగా భూముల భద్రత విషయంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని ఒక దుర్మార్గపు చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. సర్వే రాళ్లు, పాస్ పుస్తకాలపై ఫోటోలు వేసుకోవడం కోసం రూ. 700 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసి, రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను అందించి ప్రజల ఆస్తులకు పూర్తి భరోసా కల్పించామని చెప్పారు. రాయలసీమ ఇరిగేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసిన వారు నేడు అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి రాజధాని నిర్మాణం ఆగే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నాడు సైబరాబాద్‌ను నిర్మించిన అనుభవంతో, నేడు ప్రపంచం మెచ్చేలా అమరావతిని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గత 18 నెలల్లో రాష్ట్రానికి రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దేశం మొత్తం మీద వచ్చే పెట్టుబడులలో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే రావడం ఎన్డీఏ ప్రభుత్వ సమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. తల్లికి వందనం, దీపం 2 వంటి ‘సూపర్ సిక్స్’ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ పేదల సేవలో ప్రభుత్వం ముందుంటుందని ఆయన వివరించారు.

ANN TOP 10