తిరుమల దివ్యక్షేత్రం రథసప్తమి వేడుకలకు సర్వసిద్ధమైంది. ఈనెల 25వ తేదీన సూర్యజయంతిని పురస్కరించుకుని తిరుమలలో మినీ బ్రహ్మోత్సవంగా భావించే రథసప్తమిని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ విశేష పర్వదినాన శ్రీ మలయప్ప స్వామి వారు వేకువజాము నుండి రాత్రి వరకు ఏడు రకాల వాహనాలపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యే ఈ సేవల పరంపర.. శేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాల మీదుగా సాగి, రాత్రి చంద్రప్రభ వాహన సేవతో ముగుస్తుంది. మధ్యలో స్వామివారికి చక్రస్నానం కూడా నిర్వహిస్తారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. రథసప్తమి రోజున నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి అన్ని రకాల ఆర్జిత సేవలను పూర్తిగా రద్దు చేశారు. అలాగే వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, చంటి బిడ్డల తల్లిదండ్రులకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలతో పాటు ఎన్ఆర్ఐ దర్శనాలను కూడా నిలిపివేశారు. జనవరి 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు స్లాటెడ్ సర్వ దర్శనం (SSD) టోకెన్ల జారీని కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
దర్శనాల విషయంలో సామాన్య భక్తులకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. బ్రేక్ దర్శనాల కోసం జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. తిరువీధుల్లో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎండ నుంచి ఉపశమనం కలిగించేలా పందిళ్లు వేయడం, తాగునీరు మరియు అన్నప్రసాదాల పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేశారు. మినీ బ్రహ్మోత్సవం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లను కూడా పటిష్టం చేశారు









