AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్: కొత్త రహదారి ప్రారంభం.. గిరి ప్రదక్షిణ మార్గంపై కీలక ఆదేశాలు!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండను సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులకు ఇచ్చిన హామీ మేరకు కోటప్పకొండ – కొత్తపాలెం గ్రామాల మధ్య రూ. 3.9 కోట్ల వ్యయంతో నిర్మించిన 8 కిలోమీటర్ల నూతన రహదారిని ఆయన ప్రారంభించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు కోరిన వెంటనే స్పందించిన పవన్, శివరాత్రి ఉత్సవాల లోపే పనులు పూర్తి చేసి రోడ్డును అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ఈ రహదారి వల్ల శివరాత్రికి వచ్చే లక్షలాది మంది భక్తులతో పాటు స్థానిక రైతులు, విద్యార్థుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.

మొదటగా త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పాదాభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం కొండ చుట్టూ ప్రతిపాదించిన గిరి ప్రదక్షిణ మార్గం లేఅవుట్‌ను అటవీశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అటవీశాఖ అనుమతులను త్వరగా పూర్తి చేసి, ప్రదక్షిణ మార్గ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.

అనంత‌రం ఘాట్ రోడ్డులోని ‘వనవిహారి’ జింకల పార్కును సందర్శించిన పవన్, అక్కడ జింకలకు స్వయంగా ఆహారాన్ని అందించారు. పార్కులోని వివిధ రకాల పక్షి జాతులు, వృక్షాల వివరాలను అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యటన పొడవునా జనసైనికులు, వీరమహిళలు ఆయనకు పూలు, హారతులతో ఘనస్వాగతం పలికారు. ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ANN TOP 10