AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్ రెడ్డిలో రాము, రెమో.. ఇద్దరూ ఉన్నారు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిలో ‘రాము’, ‘రెమో’ అనే రెండు కోణాలు ఉన్నాయని.. ఒకవైపు సినిమా టిక్కెట్ల ధరలు పెంచబోమని చెబుతూనే, మరోవైపు పెంపునకు జీవోలు జారీ చేస్తున్నారని విమర్శించారు. సర్వాయి పాపన్న పేరుతో జిల్లా చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఉన్న జనగామ జిల్లానే తొలగించాలని చూడటం ఆయన వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పూర్తిగా సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో స్వయంగా ముఖ్యమంత్రి ప్రచారం చేసినా కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదని, తాము 40 శాతం సర్పంచ్ స్థానాలను గైవసం చేసుకున్నామని గుర్తు చేశారు. శివరాత్రి లోపే మున్సిపల్ ఎన్నికలు ముగుస్తాయని, క్షేత్రస్థాయిలో బలం ఉన్న తమ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని జిల్లాల రద్దు అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ, నారాయణపేట వంటి జిల్లాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే జిల్లాల రద్దు ఖాయమని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనను ‘తుగ్లక్ పాలన’గా అభివర్ణించిన ఆయన, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం చేస్తున్న ఈ తప్పులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని వెల్లడించారు.

ANN TOP 10