కెనడాకు చెందిన ఒక వ్యక్తి 2013లో తన భార్యతో కలిసి సింగపూర్‌కు వలస వెళ్ళాడు. అక్కడ ఒక ప్రముఖ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా నెలకు సుమారు రూ. 50 లక్షలు (ఏడాదికి రూ. 6 కోట్లు) జీతం పొందేవాడు. అయితే, భార్యతో విభేదాల కారణంగా విడాకుల కేసు నడుస్తుండటంతో, భార్య మరియు నలుగురు పిల్లల పోషణ కోసం నెలకు రూ. 16 లక్షలు భరణం చెల్లించడానికి తొలుత అంగీకరించాడు. కానీ ఆ తర్వాత ఆ మొత్తాన్ని చెల్లించడం ఇష్టం లేక, తన ఉన్నత స్థాయి ఉద్యోగానికి రాజీనామా చేసి రహస్యంగా కెనడాకు పారిపోయాడు.
భరణం అందకపోవడంతో భార్య సింగపూర్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన జిల్లా న్యాయమూర్తి ఫాంగ్ హ్సియావో చుంగ్ సదరు వ్యక్తి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల తండ్రి తన కుటుంబ పోషణ కోసం మరో ఉద్యోగం వెతుక్కున్న తర్వాతే రాజీనామా చేయాలని, కేవలం భరణం తప్పించుకోవడానికే ఇలా చేయడం బాధ్యతారాహిత్యమని మందలించారు. నిందితుడు కోర్టుకు హాజరుకాకపోవడంతో అతడిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది.
చివరికి న్యాయస్థానం అతడికి గట్టి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. సెప్టెంబర్ 2023 నుండి సెప్టెంబర్ 2025 వరకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ. 4 కోట్లు (634,000 సింగపూర్ డాలర్లు) వెంటనే చెల్లించాలని ఆదేశించింది. అలాగే, భవిష్యత్తులో పిల్లల ఖర్చుల బాధ్యతను తల్లిదండ్రులిద్దరూ సమానంగా పంచుకోవాలని స్పష్టం చేసింది. కెనడాలో అతడి జీతం తగ్గినా, తండ్రిగా తన ఆర్థిక బాధ్యతల నుండి తప్పించుకోలేడని కోర్టు ఈ సందర్భంగా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది.









