AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సిరిసిల్లపై కేంద్రానిది వివక్షే: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు కేటీఆర్ ఘాటు లేఖ

సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. సిరిసిల్లకు మెగా క్లస్టర్ మంజూరు చేయాలనే డిమాండ్ నిన్న మొన్నటిది కాదని, గత పదేళ్లుగా తాము నిరంతరం పోరాడుతున్నామని కేటీఆర్ గుర్తుచేశారు. కేంద్ర బృందాలే స్వయంగా పర్యటించి సిరిసిల్లకు అన్ని అర్హతలు ఉన్నాయని ధ్రువీకరించినప్పటికీ, ఫైళ్లను పక్కన పెట్టడం వెనుక రాజకీయ కక్ష ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

తెలంగాణ వస్త్ర పరిశ్రమకు సిరిసిల్ల గుండెకాయ లాంటిదని, ఇక్కడ 30 వేలకు పైగా పవర్ లూమ్స్‌పై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని కేటీఆర్ వివరించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో సిరిసిల్ల కంటే తక్కువ సామర్థ్యం ఉన్న చోట్ల క్లస్టర్లు మంజూరు చేసిన కేంద్రం, అన్ని అర్హతలున్న సిరిసిల్లను విస్మరించడం ప్రాంతీయ వివక్షకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమి, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను సిద్ధం చేసిందని, అయినప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి సానుకూల నిర్ణయం రాకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.

‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ వంటి నినాదాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో అద్భుతమైన సామర్థ్యం ఉన్న సిరిసిల్ల వంటి కేంద్రాలకు మద్దతు ఇవ్వకపోవడం వారి ద్వంద్వ నీతిని చాటుతోందని కేటీఆర్ విమర్శించారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లోనైనా సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను అధికారికంగా ప్రకటించి, తెలంగాణ నేతన్నలకు దశాబ్ద కాలంగా జరుగుతున్న అన్యాయానికి ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా, సహకార సమాఖ్య స్ఫూర్తితో ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు.

ANN TOP 10