ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో బుధవారం నిర్వహించిన పొంగల్ సంబరాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎప్పుడూ ఫార్మల్ డ్రెస్ లేదా కోట్ జాకెట్‌లో కనిపించే ఆయన, పండుగ సందర్భంగా అందుకు భిన్నంగా సంప్రదాయబద్ధమైన అచ్చతెలుగు పంచెకట్టులో మెరిశారు. ఈ వేడుకల్లో తెలుగుదనం ఉట్టిపడేలా ఆయన కనిపించిన తీరు అక్కడి వారందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దక్షిణ భారత సంస్కృతిని ప్రతిబింబించేలా జరిగిన ఈ వేడుకల్లో రామ్మోహన్ నాయుడు తన సహచర మంత్రులు, ఎంపీలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఆయన ప్రత్యేకంగా సత్కరించారు. రామ్మోహన్ నాయుడు వేషధారణను చూసిన ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు “చాలా బాగుంది” అంటూ మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం విశేషం.
తెలుగు, తమిళ సంప్రదాయాల కలయికగా సాగిన ఈ పొంగల్ వేడుకలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. దక్షిణాది రాష్ట్రాల ఆచార వ్యవహారాలను గుర్తు చేస్తూ ఢిల్లీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు అటు ఆధునికతను, ఇటు సంప్రదాయాన్ని మేళవించి అందరి దృష్టిని ఆకర్షించారు. 2026 సంక్రాంతి పండుగ వేళ హస్తినలో తెలుగు సంస్కృతిని ఘనంగా చాటిచెప్పిన ఈ యువ మంత్రిపై సోషల్ మీడియాలోనూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.









