అంతరిక్ష ప్రయాణంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అద్భుతమైన ఘనతను సాధించింది. ఇస్రో గురువారం తన స్పేడెక్స్ డీ-డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే ఈ మిషన్‌ను ఇస్రో చేపట్టింది. భవిష్యత్ లో చేపట్టబోయే భారీ అంతరిక్ష యాత్రకు అవసరమైన ఈ కీలక పరిజ్ఞానాన్ని ఇస్రో ఒడిసిపట్టింది.
భారత అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్-4, గగన్‌యాన్ సహా భవిష్యత్ ప్రయోగాలకు ఇస్రో మార్గం సుగమం చేసినట్లు.. భారత అంతరిక్ష సంస్థకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. స్పేడెక్స్ ఉపగ్రహాలను విజయవంతంగా నిర్వీర్యం చేయడం భారతదేశ అంతరిక్ష సామర్థ్యాలకు ఒక పెద్ద ముందడుగు అని కేంద్ర మంత్రి రాసుకొచ్చారు. ఇది భారత అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్-4, గగన్‌యాన్ వంటి భవిష్యత్ మిషన్లకు తలుపులు తెరుస్తుంది. ఇస్రో స్పేడెక్స్ ఉపగ్రహాలు డీ-డాకింగ్ ను పూర్తి చేశాయి.
ఇస్రో తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ ప్రయోగానికి సంబంధించి పోస్ట్ చేసింది. అనుకున్న విధంగానే క్యాప్చర్ లివర్ 3 విడుదలైందని.. రెండు ఉపగ్రహాలకు డీ-క్యాప్చర్ కమాండ్ ఇవ్వడం ద్వారా డీ-డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిందని ఇస్రో పేర్కొంది. ఈ ఘనతను సాధించడంపై కేంద్ర మంత్రి ఇస్రో బృందాన్ని అభినందించారు. ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానించే మిషన్ లో భాగంగా భారత అంతరిక్ష సంస్ఖ(ఇస్రో) గతేడాది డిసెంబర్ 30న ఛేజర్, టార్గెట్ జంట ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించింది. పలు ప్రయత్నాల అనంతరం ఈ ఏడాది జనవరి 16న డాకింగ్ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా అమెరికా, రష్యా, చైనా తర్వాత అంతరిక్ష డాకింగ్ ను విజయవంతంగా పూర్తి చేసి నాలుగో దేశంగా భారత్ అవతరించింది.