ఏపీ అధికారంలో భాగస్వామ్యం తర్వాత జనసేన తొలి ఆవిర్భావ సభ జరగనుంది. కేవలం రెండు కీలక అంశాలు ఎజెండాగా సాగనుంది ఈ సభ. జయ కేతనం పేరుతో జరగుతున్న ఈ ప్లీనరీలో సనాతన ధర్మ పరిరక్షణ, పార్టీ విస్తరణ ప్రధానంగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం వీటిపై ఉండనుంది.
ముస్తాబైన పిఠాపురం
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు పిఠాపురంలోని చిత్రాడ ముస్తాబైంది. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో ఆవిర్భావ సభను జరగనుంది. ఇందుకు సంబంధించి పార్టీ నేతలు ఏర్పాట్లను పూర్తి చేశారు. 50 ఎకరాల ప్రాంగణంలో ‘జయకేతనం’ పేరుతో ఈ సభ జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సభ జరగనుంది.
అజెండా ఇదేనా?
దశాబ్దం పోరాటం తర్వాత ఏపీ అధికారంలో భాగస్వామి అయ్యింది జనసేన పార్టీ. భవిష్యత్తు ప్రణాళికలుగా సనాతన ధర్మ పరిరక్షణ, పార్టీ విస్తరణను ఈ వేదికపై నుంచి ప్రకటించనున్నారు అధినేత పవన్ కల్యాణ్. ఏపీ కాకుండా తెలంగాణ తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో సనాతన ధర్మ పరిరక్షణ కోసం అధినేత పలు యాత్రలు చేపట్టారు. రానున్న రోజుల్లో వీటిని తీవ్రతరం చేయనున్నారు.
దేశవ్యాప్తంగా పర్యటించి సనాతన ధర్మ పరిరక్షణ కోసం జనసేన ఎలా కట్టుబడి ఉందో వివరించనున్నారు. ఇతర మతాలను గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లేలి అనేదానిపై అధినేత ప్రసంగం సాగనుంది. జనసేన పార్టీని తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తరించేలా కేడర్‌కు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇతర పార్టీ నాయకులు జనసేన వైపు రావాలనుకునే వారికి ఆహ్వానం పలకనున్నారు.
ఎలాంటి నియమాలు పాటించాలనే దానిపైనా సభలో ఓ స్పష్టత ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల చెబుతున్నాయి. ప్రస్తుతం సభ రెండు అంశాలపై పరిమితం కావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఎన్నికలకు చాలా సమయం ఉండడంతో రెండు ఎజెండాలతో సభ సాగనుంది. పిఠాపురం నియోజకవర్గ పవన్‌కు కేరాఫ్‌గా మారిన తర్వాత తొలిసారి జరుగుతున్న ప్లీనరీ సక్సెస్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు జనసేన నేతలు.
సభ ఏర్పాట్లపై
పవన్ కళ్యాణ్ ప్రసంగం సాయంత్రం ఆరు లేదా ఏడు మధ్య జరగవచ్చని అంటున్నారు. తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ పార్టీ మంత్రి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటించారు. గడిచిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసేన, భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరు తెన్నులపై చర్చిస్తామని తెలిపారు.
శుక్రవారం మధ్యాహ్యం మూడున్నర గంటలకు మంగళగిరి నేరుగా చిత్రాడకు చేరుకుంటారు అధినేత పవన్ కల్యాణ్. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చిత్రాడ గ్రామంలో 50 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సభ జరగబోతుంది. వేదికపై పవన్ తోపాటు 250 మంది వరకు ఆసీనులయ్యేలా సిద్ధం చేశారు. ఈ సభకు మూడు ద్వారాలు ఉండనున్నాయి.
ఒక్కోదానికి ఒక్కో పేరు పెట్టారు. రావు సూర్యారావు బహుదూర్ మహారాజ్, డొక్కా సీతమ్మ, మల్లాడి సత్యలింగ నాయకర్ లాంటి సామాజికవేత్తల పేర్లు ఉంటాయి. 175 నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు వచ్చేలా ఆయా బాధ్యతలను జిల్లాల ఇన్‌ఛార్జులకు అప్పగించారు. ఈ సభకు దాదాపు ఐదు లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తోంది ఆ పార్టీ. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు.