AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కారుతో ఢీకొట్టి.. కత్తులతో నరికి.. కాంగ్రెస్‌ నేత దారుణ హత్య

జీవన్‌రెడ్డి అనుచరుడిని మట్టుబెట్టిన దుండగులు
జగిత్యాలలో తీవ్ర ఉద్రిక్తత

(మహా, హైదరాబాద్‌):
జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు దారణ హత్యకు గురయ్యారు. కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీటీసీని విచక్షణా రహితంగా కత్తులతో నరికి చంపడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జగిత్యాల రూరల్‌ మండలం జాబితాపూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

జాబితాపూర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి(58) మంగళవారం ఉదయం పని నుంచి ఇంటికి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అయితే కొన్ని రోజులుగా అతణ్ని చంపేందుకు పథకం రచించిన గుర్తుతెలియని దుండగలు.. ఉదయం గ్రామానికి చేరిన కాంగ్రెస్‌ నేత గంగారెడ్డిని ఒక్కసారిగా కారుతో ఢీకొట్టారు. గంగారెడ్డి కిందపడిపోగానే అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణా రహితంగా నరికారు. కత్తులతో కడుపులో పొడిచారు. దీంతో అతని తీవ్రగాయాలు అయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు, కుటుంబసభ్యులు రక్తపు మడుగులో పడి ఉన్న గంగారెడ్డిని హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గంగారెడ్డి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది.

నిరసనకు దిగిన జీవన్‌రెడ్డి
అయితే హత్య గురించిన తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్‌ శ్రేణులు సైతం ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. గంగారెడ్డిని హత్య చేయడంపై వారంతా ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. తన అనుచరుడిని హత్య చేయడం అంటే తనను కూడా హత్య చేసినట్లే అని ఎమ్మెల్సీ అన్నారు. క్రీయాశీలకంగా పార్టీలో పని చేస్తే చంపేస్తారా అంటూ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. నిందితులను పట్టుకోవాలని పోలీసులను డిమాండ్‌ చేశారు.

పెద్దఎత్తున కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. వాహనాలు భారీగా నిలిచిపోవడంతో వాటిని బైపాస్‌ మీదుగా మళ్లిస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో జాబితాపూర్‌ గ్రామంలో పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. భారీగా మెుహరించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేశారు. గంగారెడ్డి హత్యకు రాజకీయ కక్షలా లేక మరైదేనా విషయం ఉందా అనే పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

ANN TOP 10