AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యాదాద్రికి రైల్వే లైన్.. ఎంఎంటీఎస్‌ను పొడిగిస్తాం.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

ప్రతి రోజూ వేల మంది భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని మెుక్కులు తీర్చుకుంటున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి నగరం నుంచి రోజు పది వేల మంది భక్తులు వెళ్తారని అంచనా. ప్రస్తుతం రోడ్డు మార్గంలోనే భక్తులు యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు. నగరంలో విపరీతమైన ట్రాఫిక్‌ సమస్య కారణంగా గంటన్నర పాటు నగరం దాటేందుకు సమయం పడుతోంది. నగరం దాటిన తర్వాత మరో రెండు రెండు గంటలు. మెుత్తంగా నాలుగైదు గంటలు ప్రయాణానికే పోతుంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి యాదాద్రి వెళ్లేవారికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీపి కబురు చెప్పారు. యాదాద్రి వరకు ప్రత్యేక రైల్వే లైన్ నిర్మించి ఎంఎంటీఎస్‌ను పొడిగిస్తామని చెప్పారు. అందుకు సంబంధించిన టెండర్లు పూర్తి అయ్యాయని అన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. అమృత్ పథకం కింద రూ.450 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను నేడు కిషన్ రెడ్డి సందర్శించారు.

చర్లపల్లి టెర్మినల్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని.. త్వరలోనే ప్రధాని మోదీ స్టేషన్‌ను ప్రజలకు అంకితం చేస్తారని చెప్పారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు సైతం వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. యాదాద్రితో పాటుగా కొమురవెల్లి మల్లన్న ఆలయానికి సమీపంలో నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుందన్నారు. అది కూడా పూర్తి అయితే యాదాద్రికి, కొమురవెల్లికి ప్రత్యేక ట్రైన్లు నడుస్తాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.

ANN TOP 10