AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఓల్డ్‌ సిటీ ఉగ్రవాదుల అడ్డా.. కేంద్రమంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌

పెంచిపోషిస్తున్న ఒవైసీ కుటుంబం
(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారని, ఎంఐఎం, ఓవైసీ కుటుంబం పర్మిషన్‌తోనే ఓల్డ్‌ సిటీ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఓల్డ్‌ సిటీని రోహింగ్యా లకు, టెర్రరిస్టులకు అడ్డాగా మార్చారంటూ ఒవైసీపై విరుచుకుపడ్డారు. ఆదివారం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ టెర్రరిస్టులు పట్టుబడ్డా వారిలో కచ్చితంగా ఒక్కరికైనా ఓల్డ్‌ సిటీతో లింకులు ఉంటాయని ఆరోపించారు.

ఆయనకు హిందూఫోబియా ఉందా?
కాగా.. బండి సంజయ్‌ కి ఇస్లామోఫోబియా పట్టుకుందని, అందుకే మదర్సా లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ శనివారం నాడు ఎంఐఎం పార్టీ మీటింగ్‌లో ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన బండి సంజయ్‌.. తనకు ఇస్లామోఫోబియా ఉందని ఓవైసీ అంటున్నాడని, అయితే 15 నిముషాల్లో అందరినీ నరికి చంపేస్తాను అన్నోడికి హిందూఫోబియా ఉందా..? అని ప్రశ్నించారు. ఓవైసీ కానీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఏనాడూ వందేమాతరం ఆలపించలేదని, అలాంటివారికి ఏం ఫోబియా ఉందో చెప్పాలని ప్రశ్నించారు. హిందువులందరూ సెక్యులర్లం అని గొప్పగా చెప్పుకుంటూ పీర్ల పండగ చేసుకుంటారని, కానీ ఒవైసీ ఎప్పుడైనా వినాయకచవితి, దసరా ఉత్సవాలు చేసుకున్నారా..? బొట్టు పెట్టుకుని హిందూ దేవుళ్లకి దండం పెట్టారా..? అని ప్రశ్నించారు.

మదర్సాలే అడ్డాలు..
మదర్సాల గురించి తాను మాట్లాడితే ఒవైసీ తెగ బాధపడ్డాడని, అయితే ప్రపంచం మొత్తం బ్యాన్‌ చేసిన టెర్రరిస్ట్‌ ఆర్గనైజేషన్‌ లీడర్‌ గా పని చేస్తున్న ఓ టెర్రరిస్ట్‌ ఒవైసీ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తూ దొరికాడని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ లోని బిజ్నోర్‌ మదర్సాలో 9 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు వారి దగ్గరి నుంచి ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు. అలాంటప్పుడు మదర్సాలు టెర్రరిస్టులను తయారు చేస్తున్నాయని అనడంలో తప్పేంటని ప్రశ్నించారు.

ANN TOP 10