– నాలుగు కాలనీలకు తాఖీదులు ఇచ్చిన అధికారులు
– ఎలాంటి చర్యకైనా సహకరిస్తా: తిరుపతి రెడ్డి
(అమ్మన్యూస్, హైదరాబాద్):
రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల కబ్జాలను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులను అంటించారు. మాదాపూర్ అమర్ కో–ఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు, కార్యాలయం దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు ఆ నోటీసుల్లో తెలిపారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఆ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేసిన రెవెన్యూ అధికారులు.. అందుకు 30 రోజుల గడువు ఇచ్చారు.
కలెక్టర్ నేతృత్వంలో..
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్/ తహసీల్దార్.. దుర్గంచెరువుకు ఆనుకుని ఉన్న నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేయగా… ఆ మేరకు పలు ఇళ్లకు వాటిని అంటించారు. వీరికి కూడా నెల రోజుల గడువు ఇచ్చి, ఎఫ్‌టీఎల్‌ను ఆక్రమించిన కట్టిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలని పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలోని ఓ మీడియా సంస్థ కార్యాలయానికి కూడా నోటీసులు అంటించడం గమనార్హం.
కాలనీల్లో కలకలం..
దుర్గం చెరువు పరిసరాల్లోని నాలుగు కాలనీల్లోని వందల ఇళ్లు, కమర్షియల్ కాంప్లెక్సులకు వాల్టా చట్టంలోని సెక్ష¯Œ 23(1) కింద తాఖీదులు ఇచ్చారు. లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు. దీంతో ఆ కాలనీల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
అధికారులకు పూర్తిగా సహకరిస్తా..
హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. 2015లో అమర్ కో ఆపరేటివ్ సొసైటీలో తాను ఇల్లు కొనుగోలు చేశానని, అది ఎఫ్‌టీఎల్ పరిధిలో వస్తుందని తనకు తెలియదన్నారు. ఒకవేళ తాను నివాసం ఉంటున్న ఇల్లు.. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే ప్రభుత్వం, హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకున్న తనకు అభ్యంతరం లేదని వెల్లడించారు.
ప్రముఖుల ఇళ్లు సైతం ఇక్కడే..
దుర్గంచెరువు పరిధిలో పలువురు ఐఏఎస్, ఐఆర్‌ఎస్ అధికారులతోపాటు సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు కూడా ఉండటం గమనార్హం. కాగా, ఇప్పటికే ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే.
సీక్రెట్ లేక్‌గా..
హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దుర్గం చెరువుకు ‘సీక్రెట్ లేక్’గా గుర్తింపు ఉంది. అయితే.. హైటెక్‌సిటీ నిర్మాణం తర్వాత క్రమంగా చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి. ఈ ప్రాంతాల్లో రాజకీయ, వ్యాపార ప్రముఖులు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, విశ్రాంత బ్యూరోక్రాట్లు నివాసాలను ఏర్పాటు చేసుకోవడంతో.. క్షేత్రస్థాయి సిబ్బంది వాటి జోలికి వెళ్లలేదని తెలుస్తోంది. ఇప్పుడు హైడ్రా చర్యలతో కదలిక వచ్చింది.









