ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రి హరీశ్ రావు, వద్దిరాజు రవిచంద్ర కలిశారు. ఎమ్మెల్సీ కవిత ఇటీవలే అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను నిన్న ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీశ్ రావు, వద్దిరాజు రవిచంద్రలు తిహార్ జైలుకు వెళ్లి కవితను కలిశారు.
తిహార్ జైలులో ఆమె గొంతు నొప్పి, తీవ్రమైన జ్వరంతో బాధపడ్డారు. జైలు అధికారులు వెంటనే ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో అధికారులు తిరిగి ఆమెను తిహార్ జైలుకు తరలించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన కవిత.. బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు సహా సుప్రీంకోర్టు వరకు ఆమె బెయిల్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆమె బెయిల్ పిటిషన్లను పలుమార్లు తిరస్కరించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి. ఈ నెల 27వ తేదీన తదుపరి విచారణ జరగనుంది.









