AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజ్యాంగాన్నే కాదు రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర

రాజ్యాంగాన్నే కాదు రిజర్వేషన్లను రద్దు చేయడానికి కూడా బీజేపీ కుట్ర చేస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్‌గాంధీ. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లపై 50 శాతం లిమిట్‌ ఎత్తేస్తామన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి దళితులు,ఓబీసీలు, ఆదివాసీలకు న్యాయం చేస్తామన్నారు రాహుల్‌గాంధీ.

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబంలోని మహిళ ఖాతాల్లో జమ చేస్తుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. అలాగే ప్రతి కుటుంబానికి ప్రతినెలా ఒకటో తారీఖున రూ.8,500 చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఈ మొత్తాన్ని వారి కుటుంబాల్లోని పిల్లల చదువులు, వైద్యం కోసం వినియోగించుకోవచ్చని అన్నారు. తద్వారా ఒక్క దెబ్బతో దేశంలో ఉన్న పేదరికాన్ని రూపుమాపుతామని చెప్పారు. జూన్‌ 7న ఇండియా కూటమి ప్రభుత్వం కేంద్రంలో కొలువు దీరుతుందని, ప్రపంచంలో ఏ దేశంలో లేనివిధంగా, ఎవరూ కలలో కూడా ఊహించని వి«ధంగా ఈ చారిత్రాక పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నామని అన్నారు. గురువారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో తెలంగాణ జనజాతర బహిరంగసభలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. దేశంలోని నిరుపేదల కలలను సాకారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమం ప్రపంచ దేశాలకే ఆదర్శం అవుతుందని అన్నారు. మళ్లీ అధికారం లోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని మోదీ,అమిత్‌షాతో సహా బీజేపీ అగ్రనేతలందరూ చెబుతున్నారి విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని తాము కాపాడుతామన్నారు. బీజేపీ హయాంలో 22 మంది మాత్రమే కోటీశ్వరులయ్యారని, కాని తాము అధికారంలోకి వచ్చాక ప్రతి పేద కుటుంబం లోని మహిళ బ్యాంక్‌ ఖాతాలో ఏడాదికి లక్ష, నెలకు రూ. 8,500 వేస్తామన్నారు రాహుల్‌గాంధీ. ఈ పథకాన్ని ప్రపంచమంతా ఆదర్శంగా తీసుకుంటామన్నారు రాహుల్‌గాంధీ.

ఈసందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జనతా ప్రభుత్వం విఫలమై దేశంలో రాజకీయ అస్థిరత తాండవిస్తున్న సమయంలో మెదక్‌ ఎంపీగా ఇందిరాగాంధీ అత్యధిక మెజారిటీతో గెలిచి దేశ ప్రధాని అయ్యారన్నారు. కాంగ్రెస్‌ పాలనలోనే మెదక్‌ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధిచెందిందని, కేంద్రప్రభుత్వరంగ సంస్థలు కొలువుదీరాయని గుర్తుచేశారు. నర్సాపూర్‌ జనజాతర సభలో సీఎం మాట్లాడారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ మెదక్‌ప్రాంతాన్ని పూర్తి నిర్లక్ష్యం చేశాయన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. కేంద్రనిధులు తెస్తానని దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్‌రావు మాటతప్పినందుకు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఉన్న వెంకట్రామిరెడ్డి.. ప్రాజెక్టులపేరుతో భూములు లాక్కుని రైతులపై దమనకాండ చేశారన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలను చిత్తుగా ఓడించి కాంగ్రెస్‌ బీసీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు రేవంత్‌రెడ్డి.

ఎన్నికలొస్తే బీజేపీవాళ్లకు దేవుళ్లు, పండుగలు గుర్తుకొస్తాయన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.తమ తాతముత్తాతలు దేవుళ్లకు మొక్కలేదా, పండుగలు జరుపుకోలేదా అని ప్రశ్నించారు. దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలన్నారు రేవంత్‌రెడ్డి. తనను రాజకీయాల్లోకి లాగుతున్నందుకు ఆ దేవుడు కూడా బీజేపీవాళ్లని క్షమించరన్నారు రేవంత్‌.

ANN TOP 10