బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయాకు కర్ణాటక పోలీసులు ఝలక్ ఇచ్చారు. ముస్లింలను, కాంగ్రెస్ పార్టీని లక్షంగా చేసుకుని బీజేపీ కర్నాటక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్టు చేసిన అభ్యంతరకర ట్వీట్‌కు సంబంధించి కర్నాటక పోలీసులు బుధవారం సమన్లు జారీచేశారు. 7 రోజుల్లోపల బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలని ఆ సమన్లలో పోలీసులు ఆదేశించారు. ఓబీసీ కోటాలో ముస్లిం రిజర్వేషన్ల అనే అంశంపై బీజేపీ ఓ యానిమేటేడ్ వీడియోను తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఇందులో రాహుల్ గాంధీ, సీఎం సిద్ధరామయ్య ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు కేటాయిస్తున్నారని, వారికే ఎక్కువ నిధులు ఇస్తున్నారని చూపించారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. మతాల మధ్య చిచ్చుపెట్టాలా ప్రయత్నిస్తోందని మండిపడింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంతో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ ఐటీ హెచ్ అమిత్ మాల్వియా, కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్రపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బెంగళూరు పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు జేపీ నడ్డా, అమిత్ మాల్వియాలకు వారం రోజుల గడువు ఇచ్చారు. ఈ పోస్టును తొలగించాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎక్స్‌ని కోరింది.









