ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా మంగళవారం ( మే 07) రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదింఛేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ బ్యాటర్లలో సంజూ శాంసన్ 46 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. అయితే మిగతా బ్యాటర్లు పెద్దగా స్కోర్లు చేయకపోవడంతో రాజస్థాన్ కు పరాజయం తప్పలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఖలీల్ అహ్మద్ 2, ముఖేష్ కుమార్ 2, కుల్‌దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్, రసిఖ్ దార్ సలామ్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 12 పాయింట్లతో 5వ స్థానానికి ఎగబాకింది. అలాగే ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవడంలో రిషబ్ పంత్ జట్టు సఫలమైంది.









