రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెండింగ్ నిధులు కూడా మే 13 తర్వాత విడుదల చేయాలని ఆదేశించింది. రైతు భరోసా చెల్లింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు వెళ్లింది. అయితే ఎన్. వేణు కుమార్ అనే వ్యక్తి రైతు భరోసా విషయంలో ఫిర్యాదు చేశారు. దీంతో రైతుల అకౌంట్లో డబ్బులు వేసి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. రేవంత్ రెడ్డి ముందుగానే రైతు భరోసా సాయం అందుతుందన్న వ్యాఖ్యలను ఈసీ తప్పుబట్టింది. పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా నిధులను విడుదలకు వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు వారికి నిధులు విడుదల చేసిన సర్కార్.. ఐదు ఎకరాలు పైబడిన రైతులకు ఫండ్స్ రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం దాదాపు రూ.2000 కోట్ల నిధులను విడుదల చేసింది. అయితే, రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంగా తాజాగా ఈసీ మే 13న పోలింగ్ ముగిసిన తరువాతే పెండింగ్లో ఉన్న రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.









