కాంగ్రెస్ రిజర్వేషన్ల సవాలే కాదు.. అనేక అస్త్రాలతో మోడీ టీమ్ కు సవాల్ విసురుతోంది. రాహుల్ కు రేవంత్ తోడు కావడం క్యాంపెయిన్ స్టైల్ మారిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ధీటైన ప్రచారం చేస్తూనే జాతీయ స్థాయిలోనూ తనదైన మార్క్ ప్రదర్శిస్తోంది. ప్రత్యర్థి పార్టీలకు దీటుగా వ్యూహ, ప్రతివ్యూహాలు రచించడం.. ఇప్పటిదాకా అమలు చేసిన పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం.. విపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టడం.. ఇలా ఒకటీ, రెండు కాదు.. అన్ని అంశాల్లోనూ పైచేయి సాధిస్తోంది. ఆరు గ్యారెంటీల్లో చాలా పథకాలు అమలు చేస్తున్నామని, ఆగస్టు 15కల్లా రుణమాఫీ సైతం అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా.. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని విస్మరించబోమన్న సంకేతాలు ఇస్తోంది. రాష్ట్రంలో 17లోక్ సభ స్థానాలు ఉండగా.. కనీసం 14 చోట్ల గెలుపే లక్ష్యంగా ప్రచార పర్వంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇండియా కూటమి అధికారంలోకి రావాలన్నా, రాష్ట్రంలో ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలన్నా.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అన్నీ తానైౖ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రచారంలో పరుగులు పెడుతూ.. యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మంత్రులకు ఇన్ ఛార్జి బాధ్యతలు అప్పగించి అలర్ట్ చేయడంతో పాటు ప్రతీరోజూ నాలుగైదు సభల్లో పాల్గొంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో అవసరమైన సేవలు అందిస్తున్నారు.
మోడీ అమిత్ షా టార్గెట్ రేవంత్
ప్రాంతీయ పార్టీ నుంచి నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగానే తెలంగాణలో పార్టీకి కొత్త ఊపిరి ఊదారు. అన్నింటికన్నా ముఖ్యంగా అధిష్టానం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ నిచ్చింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రిగా తనదైన మార్కును చూపుతూ వెళుతున్న రేవంత్ సామర్థ్యాన్ని అధిష్టానం గుర్తించింది. జాతీయ స్థాయి క్యాంపెయినర్స్ లిస్టులో రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. రేవంత్ రెడ్డి తనకి లభించిన ఈ అవకాశాన్ని కూడా చక్కగా ఉపయోగించుకున్నారు. వెళ్లిన ప్రతి చోటా మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. రిజర్వేషన్ల అంశంలో అమిత్ షా ఆత్మరక్షణలో పడ్డారు. బడేబాయ్ అంటూనే మోడీని బోల్తా కొట్టించారు. రిజర్వేషన్ల రద్దు, గాడిదగుడ్డు అస్త్రాలు బిజెపికి ఇబ్బందికరంగా మారాయి. అమిత్ షా తెలంగాణకు వచ్చిన సందర్భంగా రేవంత్ నే టార్గెట్ చేశారు. రేవంత్ అస్త్రాలు ఒక్క తెలంగాణకే పరిమితం కాకుండా జాతీయస్థాయిలో బిజెపిని ఇరుకున పెడుతున్నాయి.
అంతా తానై రేవంత్ ప్రచారం
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కార్యాచరణను అంతా తానై నడిపిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అభ్యర్థుల తరఫున ప్రచారాన్నీ తన భుజస్కందాలపైనే వేసుకున్నారు. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లోనూ సభలు, కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలకు హాజరవుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 3 కార్యక్రమాలు ఉండేలా ప్లాన్ చేశారు. అన్ని జిల్లాల్లో దాదాపు పూర్తిచేశారు. రాహుల్ ఒక రౌండ్ ప్రచారం చేయగా, ప్రియాంక షెడ్యూల్ కూడా ఖరారైంది. మిషన్ 14లక్ష్యంగా అడుగులు వేస్తున్న రేవంత్ పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ప్రత్యర్ధులపై పూర్తి ఆదిపత్యాన్ని కనబరుస్తున్నారు. పది ఖాయమని, రేవంత్ దూకుడు చూస్తే 14 సాధించినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.









